ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 6:35 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రజలకు సమాధానం చెప్పాలి

గోదావరిఖని,అర్జున్ సమాచారం:
:

ఏఐసీసీ పిలుపు మేరకు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సోమవారం ఉదయం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ మహంకాళి స్వామి హాజరై, రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండీ. ముస్తఫా , నాయకులు, కార్యకర్తలతో కలిసి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి  మాట్లాడుతూ—

“ఎన్నికల సంఘం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందిన సంస్థ కాదు. అది భారత రాజ్యాంగం కల్పించిన స్వతంత్ర రాజ్యాంగ సంస్థ. దేశంలోని ప్రతి ఓటరుకు సమానంగా ఉండాల్సిన సంస్థ. కానీ ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై నేడు ప్రజల్లో అనేక ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

SIR పేరుతో ఓటర్ల జాబితా సవరణ జరుగుతున్న తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకూడదు. ఓటు హక్కు కోల్పోయే పరిస్థితి ఏ ఒక్క పౌరుడికీ రాకూడదు. ప్రజల ఓటు హక్కును కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.

ఎన్నికల సంఘం నిర్ణయాలు పూర్తిగా స్వతంత్రంగా జరుగుతున్నాయా? లేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారా? అనే ప్రశ్నలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే.

ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందనే ఆరోపణలకు తావులేకుండా తన స్వతంత్రతను ఆచరణలో నిరూపించుకోవాలి. ఎన్నికల సంఘం బీజేపీ కోసం కాదు.. కేంద్ర ప్రభుత్వం కోసం కాదు.. భారత ప్రజల కోసం పనిచేయాలి.”

“ప్రజాస్వామ్యంలో ఓటు అనేది కేవలం ఒక గుర్తు కాదు.. ప్రజల చేతిలో ఉన్న అధికారం. ఆ అధికారాన్ని ఎవరూ బలహీనపరచడానికి వీల్లేదు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం ఉండాలంటే ప్రతి నిర్ణయంలో పారదర్శకత, ప్రతి చర్యలో నిష్పక్షపాతత్వం కనిపించాలి.

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.”
=============================